HomeTelugu Big Storiesకరోనాతో ఆరు వారాల చిన్నారి మృతి

కరోనాతో ఆరు వారాల చిన్నారి మృతి

2 1

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంటుంది ఈ మహమ్మారి. ఇప్పటికే ప్రపంచవ్యాస్తంగా దాదాపు 47వేల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికంగా అమెరికా, యూరప్‌లోనే చనిపోతుండడం విచారకరం. ఇదిలా ఉంటే తాజాగా కరోనా సోకిన ఆరు వారాల చిన్నారి మృతి చెందింది. అమెరికాలో ఇంత తక్కువ వయసుగల చిన్నారి మృతిచెందడం ఇదే తొలిసారి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన ఆరువారాల చిన్నారి కరోనాతో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ నెడ్‌ లామోంట్‌ ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో ఈ వైరస్‌ ఏవయస్సువారికీ సురక్షితం కాదనే అంశం స్పష్టమవుతోందన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలతో అచేతన స్థితిలోఉన్న చిన్నారిని గతవారం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం చిన్నారి మరణించిందని వైద్యులు ప్రకటించారు. కాగా వైద్య పరీక్షల్లో చిన్నారికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కొవిడ్‌-19 కారణంగా చిన్నారి మరణించడం తీవ్రంగా కలచివేసిందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవడం వలన తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. అయితే, గతవారం అమెరికాలోని ఇల్లినోయిస్‌ నగరానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కూడా కొవిడ్‌-19తో మరణించినట్లు అధికారులు తెలిపారు.

కనెక్టికట్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 85 మంది మరణించగా బాధితులు సంఖ్య 3557గా ఉంది. కేవలం నిన్న ఒక్కరోజే ఇక్కడ 429పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారితో 5వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 2లక్షలకు పైగా ఈ వైరస్‌ బారినపడ్డారు. ముఖ్యంగా న్యూయార్క్‌ నగరం కరోనా వైరస్‌ విజృంభణతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 83వేల మంది వైరస్‌కు బాధితులుగా మారారు. గడచిన 24గంటల్లోనే ఇక్కడ 8వేల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో అత్యధిక కేసులు న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. అయితే చిన్నారి మరణించిన కనెక్టికట్‌ కూడా న్యూయార్క్‌ నగరానికి సమీపంలోనే ఉండడంతో వైరస్‌ తీవ్రత అక్కడ పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంలో చిన్నారులు, వృద్ధులపై ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వయసుతో తేడా లేకుండా యువకులు కూడా ఈ వైరస్‌ బారినపడి మరణిస్తుండడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu