రెండు మెదడులతో కూడిన యువకుడి కథతో ఆది

పురాణాల్లో ఒక అంశాన్ని తీసుకొని దానికి అనుగుణంగా కథను అల్లుకొని రెండు మూడు గంటలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించడమే బుర్రకథ. బుర్రకథ చెప్పడం మామూలు విషయం కాదు. కష్టంతో కూడుకున్నది. అప్పటికప్పుడు కొన్ని విషయాలను అల్లుకొని చెప్పాలి. ఇప్పుడు బుర్రకథ అనే టైటిల్ తో ఆది ఓ సినిమా చేస్తున్నాడు. టైటిల్ పాతదే అయినప్పటికీ ఎంచుకున్న కథ కొత్తగా ఉంది. ప్రేమ కావాలి, లవ్‌లీ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్‌.. అటుపై సక్సెస్‌ అందుకోలేకపోయారు. చాలా కాలం నుంచి సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం ఓ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

రెండు మెదడులతో కూడిన యువకుడి కథ. రాముడు మంచిబాలుడు అనేలా ఒకలా.. రావణుడు రాక్షసుడు అనేలా మరోలా ప్రవర్తిస్తుంటారు ఆది. అతను చేసే పనులకు.. చెప్పే మాటలకు అందరూ షాక్ అవుతుంటారు. ఇలాంటి కన్ఫ్యూషన్ షాకింగ్ ఎంటర్టైనర్ బుర్రకథ టీజర్ ఈ ఉదయం రిలీజ్ అయింది. పూర్తిస్థాయిలో కామెడీతో రూపొందించిన ఈ టీజర్ బాగానే ఆకట్టుకుంటున్నది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌ కాగా.. సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.