‘అద్భుతం’ మూవీ రివ్యూ

తేజ సజ్జా,శివానీ రాజశేఖర్‌ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? తేజ, శివానీ ఎలా నటించారు? మల్లిక్‌ రామ్‌ ‘అద్భుతం’గా చూపించారా?

కథ: సూర్య(తేజ) ఓ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పనిచేస్తుంటాడు. తన వల్లే తండ్రి చనిపోయాడని బాధపడుతుంటాడు. ఒక రోజు ఆఫీస్‌లో సూర్య చేసిన పని కారణంగా బాస్‌తో తిట్లు తింటాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ఎత్తయిన బిల్డింగ్‌ ఎక్కుతాడు. మరోవైపు వెన్నెల(శివానీ రాజశేఖర్‌)కు ఉన్నత చదువులకు వెళ్లాలని ఆశ. అయితే, పెళ్లి చేసి చేసి బాధ్యత దించుకోవాలని ఆమె తండ్రి అనుకుంటాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోనని వెన్నెల చెబుతుంది. అందుకు ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు. ఈసారి జీఈటీ పరీక్షలో పాస్‌ అవ్వకపోతే పెళ్లి చేసేస్తానని ఖచ్చితంగా చెప్పేస్తాడు. పరీక్షలో వెన్నెల ఫెయిల్‌ అవుతుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో సూర్య ఫోన్‌ నుంచి నుంచి వెన్నెల ఫోన్‌కు ఒక మెస్సేజ్‌ వస్తుంది. ప్రతిగా సూర్యకు వెన్నెల రిప్లై ఇస్తుంది. దీంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతి పక్కన పెట్టి గొడవపడతారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ కలుసుకోవాలని అనుకుంటారు. మరి వీరిద్దరూ కలుసుకున్నారా? కలవడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: టైమ్‌ ట్రావెల్‌ కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇలాంటి కథలను చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. కథ, కథనాల్లో ఎక్కడ తేడా కొట్టినా సినిమా అర్థం కాక మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో రచయిత ప్రశాంత్‌ వర్మ, దర్శకుడు మల్లిక్‌ రామ్‌ ఒక చిన్న టెక్నిక్‌ ఉపయోగించారు. అదేంటంటే ఇటీవల కాలంలో వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ కథలను తీసుకుని, దానికి తమదైన ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారంతే. ‘ప్లే బ్యాక్‌’లోలాగా మరీ భూతకాలంలోకి వెళ్లకుండా, ‘కుడి ఎడమైతే’లోలా 24 గంటల సమయం తీసుకోకుండా రెండు పాత్రల మధ్య క్రాస్‌ టైమ్‌ కనెక్షన్‌ను నాలుగేళ్లుగా తీసుకుని సినిమా తెరకెక్కించాడంతే. కథకు కాస్త హాస్యం, కాస్త ఉత్కంఠ జోడించి, కొత్త నటీనటులతో ‘అద్భుతం’ చేయాలనుకున్నాడు.

సూర్య, వెన్నెల పాత్రలను పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టిన దర్శకుడు ఇద్దరూ వేర్వేరు కాలాల్లో ఉన్నారన్న విషయాన్ని చెప్పడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకసారి ఈ విషయం తెలిశాక వీరిద్దరూ ఎలా కలుస్తారన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించాడు. ఆ పాయింట్‌ను చివరి వరకూ కొనసాగించేందుకు సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. సూర్య, వెన్నెల పాత్రల చుట్టూనే కథ, కథనాలు నడుస్తుండటంతో సినిమా నిడివి పెద్దగా ఉన్నా, చూస్తూ వెళ్లిపోవచ్చు. మధ్య మధ్యలో సత్య కామెడీ కాస్త రిలీఫ్‌.

నటీనటులు: హీరోగా తేజ సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇక శివానీ రాజశేఖర్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఫ్రెష్‌ లుక్‌తో వెన్నెల పాత్రలో బాగానే నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించింది. సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. రధన్‌ సంగీతం, విద్యాసాగర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను నిడివి వదిలేశారు. లక్ష్మీ భూపాల్‌ సంభాషణలు బాగున్నాయి. ప్రశాంత్‌ వర్మ అందించిన కథ కొత్తదేమీ కాదు. పాత పాయింట్‌నే దర్శకుడు మల్లిక్‌ రామ్‌ కొత్త నటీనటులతో కొత్తగా, ‘అద్భుతం’గా చూపించాలనుకున్నారు. ఆ విషయంలో కొంతమేర విజయం సాధించాడు.

టైటిల్‌ : అద్భుతం
నటీనటులు : తేజ, శివానీ రాజశేఖర్‌, సత్య తదితరులు
నిర్మాత : చంద్రశేఖర్‌ మొగుళ్ల
దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌
సంగీతం : రాధన్‌

హైలైట్స్‌‌: తేజ, శివానీల నటన
డ్రాబ్యాక్స్‌‌: కథలో కొత్తధనం లేకపోవడం

చివరిగా: ఆకట్టుకునే ‘అద్భుతం’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates