మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలా పాల్‌ మాజీ భర్త

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన వివాహమాడబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘జీవితంలో మనం చేసే ప్రయాణాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందరిలాగే నా జీవితంలోనూ బాధ, సంతోషం, జయాపజయాలు ఉన్నాయి. కానీ అన్ని సందర్భాల్లో నా వెన్నంటే ఉంటూ నాకు మద్దతుగా నిలిచింది మీడియా వర్గాలే. వారిని నా స్నేహితులు అనడం కంటే కుటుంబం అంటే బాగుంటుంది. నా భావోద్వేగాలను అర్థంచేసుకుని, నా ప్రైవసీని గౌరవించి నేను మళ్లీ కోలుకునేలా చేశారు. త్వరలో ఐశ్వర్య అనే వైద్యురాలితో నా వివాహం జరగబోతోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. జులైలో కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను’ అని వెల్లడించారు. తనకు కాబోయే భార్య ఫొటోలను షేర్‌ చేశారు.

కొన్నేళ్ల క్రితం విజయ్.. నటి అమలా పాల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం విజయ్‌.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్‌ హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌తో విడుదల కానుంది.