సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. పోరాటాలు కొత్తకాదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అభినందనలు. తమ్మినేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ పిలుపునందుకుకుని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించింది.’ అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన వెంటనే మైక్‌ పనిచేయలేదు. దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య కాసేపు మాటలయుద్ధం సాగింది. గళం తగ్గదని.. పోరాటాలు తనకు కొత్త కాదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.