బాహుబలి టీవీ సిరీస్ విషయంలో నిర్మాత ట్విస్ట్!

బాహుబలి సినిమాకు తెరపడిందేమో గానీ దాని ప్రస్థానాన్ని మాత్రం మేకర్స్ కొనసాగించబోతున్నారు. బాహుబలి క్యారెక్టర్స్ తో పుస్తకాల్ని, కామిక్స్ ను, టీవీ సిరీస్ ఇలా రకరకలుగా బాహుబలిని ఒక బ్రాండ్ మార్చాలని బాహుబలి టీం భావిస్తోంది. ఇప్పటికీ చాలా పనులు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం బాహుబలి టీవీ సిరీస్. దీని కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ ట్విస్ట్ ఇచ్చే విధంగా 
చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ఓ కామెంట్ చేశారు.
ఈ టీవీ సిరీస్ ను హిందీలో తెరకెక్కించబోతున్నామని.. ఆ తరువాత తెలుగు ఇతర బాషల్లో డబ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎక్కువమందికి రీచ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నా.. ఈ విషయం పట్ల చాలా వరకు అసహనం వ్యక్తం అవుతోంది. అసలు బాహుబలి ప్రస్థానం మొదలైంది తెలుగులో.. అలాంటిది తెలుగులో టీవీ సిరీస్ చేయకుండా డబ్ చేసి విడుదల చేస్తే ఒరిజినల్ ఫీలింగ్ కలగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం తెలుగు ఆడియన్స్ ను అగౌరవపరచడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారో.. లేదో.. చూడాలి!