పవన్‌ కల్యాణ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్‌

ఇకపై ప్రజాసేవకే తన జీవితం అంకితమని, నటించనని పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చెప్పినప్పటికీ ఆయన కొత్త సినిమాపై వదంతులు వస్తూనే ఉన్నాయి. దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కించనున్న సినిమాలో ఆయన నటించబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే దానిపై హరీష్‌ స్పష్టత ఇస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చారు. కాగా తాజాగా మరో వదంతు ప్రచారమైంది. బండ్ల గణేష్‌ నిర్మించబోతున్న సినిమాలో పవన్‌ నటించబోతున్నారని చెప్పుకొచ్చారు. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్లు రాశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బడ్జెట్ రూ.100 కోట్లు కేటాయించారని ఊహాగానాలు వచ్చాయి. కాగా దీనిపై గణేష్‌ స్పష్టత ఇచ్చారు. ‘నా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఖరారు కాలేదు. నా నుంచి ఏదైనా సినిమా వస్తే అందరి కన్నా ముందుగా నేను చెబుతా’ అని ట్వీట్‌ చేశారు.

పవన్‌ 2018లో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తర్వాత పవన్‌ జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఎన్నో అంచనాలతో 2019 ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క అసెంబ్లీ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates