‘భారత్’ తొలిరోజు రికార్డు కలెక్షన్లు

బుధవారం జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లోనే కాదు.. బాక్సాఫీస్‌ వద్దా ‘భారత్’ విజేతగా నిలిచింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘భారత్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరుగులు తీస్తోంది. రంజాన్‌ పర్వదినాన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే భారతదేశంలో రూ.42.30 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. బుధవారం భారత్‌ – దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ఉన్నప్పటికీ దేశంలోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయినట్లు తెలిపారు.

అంతేకాదు ఇప్పటివరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో రంజాన్‌కు విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే. ఆయన నటించిన ‘టైగర్‌ జిందా హై’ (రూ.34.10 కోట్లు), ‘సుల్తాన్‌’ (రూ.36.54 కోట్లు), ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో (రూ.40.35 కోట్లు) సినిమాల కలెక్షన్లను ‘భారత్‌’ దాటేసింది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌లుగా నటించారు. సల్మాన్‌ నటించిన చివరి రెండు సినిమాలు ‘ట్యూబ్‌లైట్‌’, ‘రేస్‌ 3’ సినిమాలు విఫలమయ్యాయి. దాంతో ఈ సినిమాపై ముందు నుంచీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

‘భారత్‌’ సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూస్తుంటే మళ్లీ సల్మాన్‌ ట్రాక్‌లో పడ్డారనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో అటు క్రికెట్‌ అభిమానులు, ‘భారత్’ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుండడంతో ఇటు సల్మాన్‌ అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారన్నమాట.