సూపర్‌ హీరో కాబోతున్న జై

ప్రేమకథా చిత్రాలతో యువతను ఆకట్టుకుంటున్న జై హీరోగా ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. జై ఇప్పుడు సూపర్‌ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ చిత్రంలో భానుశ్రీ, దేవ్‌గిల్, రాహుల్‌దేవ్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూపర్‌హీరో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ ఇందులో జీవన్‌ అనే పాత్రలో జై నటించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మధ్యతరగతి యువకుడు అతను. ఉద్యోగం, ఇల్లు అని సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి.

తన కళ్లెదుట జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంతో హీరో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఒకానొక సందర్భంగా జై సూపర్‌ హీరోగా మారతాడు. అతనికి ఊహించని శక్తులు వస్తాయి. చివరకు సమస్యల్లో ఉన్న ఈ భూమిని ఆయన ఎలా కాపాడాడన్నదే చిత్ర కథ అని
తెలిపారు. ఈ స్క్రిప్ట్‌ను చాలా మందికి చెప్పాం. ఈ సినిమా నిర్మించడానికి ఓ ధైర్యం కావాలి. అలా ముందుకొచ్చిన నిర్మాతను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.