చిదంబరానికి 26 వరకు సీబీఐ కస్టడీ


ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. నాలుగు రోజుల పాటు
కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిదంబరం ఈ నెల 26వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ నాలుగు రోజుల్లో చిదంబరం కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను రోజుకు అరగంట పాటు కలిసేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఈ కేసులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు
విన్పిస్తూ.. సీబీఐ తదుపరి విచారణ కోసం చిదంబరానికి ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వాదించారు. అనంతరం చిదంబరం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి చిదంబరానికి నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించారు.

కోర్టులో హాజరుపరచకముందు చిదంబరాన్ని వివిధ కోణాల్లో విచారించిన సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం రిమాండ్‌ ప్రతిని తుషార్‌ మెహతా న్యాయమూర్తికి అందజేశారు. అరెస్ట్‌ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరిచినట్లు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 2 గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదని న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పాటు ఈ అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా న్యాయమూర్తికి చూపించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదు రోజుల పాటు
చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించారు.