‘ఎన్టీఆర్’ మహానాయకుడు’పై సినీ ప్రముఖుల స్పందన!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యన్‌టిఆర్’ టైటిల్‌తో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగమైన ‘కథానాయకుడు’ జనవరిలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ రోజు విడుదలైన ‘మహానాయకుడు’ చిత్రంపై నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలిబుచ్చారు.

‘బాబు మామూలోడు కాదు’..రానా దగ్గుబాటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్యకు వందకు 110 మార్కులు వేస్తాను. ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడానికి విద్యాబాలన్‌ మరో కారణం’- నాగ్‌ అశ్విన్‌

‘భావోద్వేగాలతో నిండిన పవర్‌ఫుల్‌ చిత్రం ‘మహానాయకుడు’. తెలుగువారికి గర్వకారణమైన తాతగారి పాత్రలో గొప్పగా నటించినందుకు నాన్నకు శుభాకాంక్షలు. సినిమాలోని అందరి ప్రదర్శనలు చూసి చాలా ఎంజాయ్‌ చేశాను’- బ్రాహ్మణి

‘ప్రజల్లోంచి పుట్టిన ఒక నాయకుడి ప్రయాణం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పాత్రలో బాలయ్య నటవిశ్వరూపం, నందమూరి అభిమానులకు, తెలుగు ప్రజలకు ‘NTR మహానాయకుడు’ చిత్రం ఒక కమనీయ దృశ్య కావ్యం. బాలా మావయ్యకు, చిత్ర బృందానికి నా అభినందనలు’- నారా లోకేశ్‌

‘తెలుగోడి ఆత్మ గౌరవం. ఆ మహానుభావుడికి ఈ గౌరవం దక్కాల్సిందే. ఈ అద్భుతమైన సినిమాను తీయడం క్రిష్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. మీరూ ఈ అద్భుత చిత్రాన్ని చూడండి’- స్మిత (గాయని)

‘మహానాయకుడు సినిమా చూశాను. నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్‌లోని కోపాన్ని, ఆయన పడిన బాధను కళ్లకు కట్టినట్లు చూపించారు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’- అనిల్‌ రావిపూడి