
Karthikeya 3 latest update:
‘కార్తికేయ’ ఫ్రాంచైజీ టాలీవుడ్‌లో బిగ్ హిట్. నిఖిల్ కథానాయకుడిగా, చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మిస్టరీ అడ్వెంచర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ‘కార్తికేయ 2’లో శ్రీకృష్ణుని మహత్యాన్ని అద్భుతంగా చూపించడంతో సినిమా తెలుగు, హిందీలో బ్లాక్‌బస్టర్ అయ్యింది. అనుపమ్ ఖేర్ చెప్పిన శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి క్లైమాక్స్ సీన్ ప్రజల్లో పెను ప్రభావం చూపించింది.
క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు లింక్ ఇచ్చారు. ఈ మధ్య ‘థండేల్’ ప్రమోషన్లలో చందూ మొండేటి Karthikeya 3 గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నాకు అద్భుతమైన ఐడియా ఉంది. కార్తికేయ 2 నాకు ఎన్నో ఇచ్చింది, అది తిరిగి శ్రీకృష్ణునికి అంకితముగా చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పటికే రీసెర్చ్ పూర్తయింది,” అని అన్నారు.
మూడో భాగం కూడా శ్రీకృష్ణునితో సంబంధం ఉంటుందని తెలిపారు. “కార్తికేయ 2 ద్వారా చాలా మంది చిన్న పిల్లలు శ్రీకృష్ణుని గురించి కొత్తగా తెలుసుకున్నారు. గోవర్ధన గిరిని గురించి తమ తల్లిదండ్రులను ప్రశ్నించిన పిల్లలు ఉన్నారు. మన సంస్కృతి, మూలాల గురించి మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నాను” అని చెప్పారు.
‘కార్తికేయ 3’ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ, చందూ మొండేటి మాటలు వింటే ఇది ఓ గ్రాండ్ విజువల్ స్పెక్టాకల్‌గా వస్తుందని అర్థమవుతోంది. నిఖిల్ మరోసారి ఇందులో హీరోగా నటించనున్నారా? సినిమా స్కేల్ ఎలా ఉండబోతోందనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.