మురళీమోహన్‌ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నారు. వారం రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న మురళీమోహన్‌.. నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. ఆయన అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన అభిమానులతోపాటు రాజమండ్రి ప్రజలెవరూ ఆందోళన పడొద్దని, త్వరలోనే ప్రజలను కలుసుకునేందుకు రాజమండ్రి రానున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు.