ప్రమోషన్ లో కూడా పోటీనే!

గతంలో చాలా సార్లు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు పోటీ పడ్డారు. అయితే ఎక్కువ శాతం విజయాలు అందుకుంది చిరునే.. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగనుంది. చిరు 150వ సినిమా కావడం, పదేళ్ళ తరువాత ఎంట్రీ ఇస్తున్న సినిమా
కావడంతో అభిమానులు తెరపై ఎప్పుడెప్పుడు మెగాహీరోని చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. అలానే బాలయ్య వందవ సినిమా కావడం, శాతకర్ణి లాంటి గొప్ప కథను ఎన్నుకోవడం అభిమానుల పట్ల ఆసక్తిని కలిగిస్తోంది. మొదటి నుండి కూడా రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూనే ఉన్నాయి.

ప్రమోషన్ కార్యక్రమాలైతే మరీనూ.. చిరు సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్ జరుగుతుందంటే చాలు.. అటు పక్క శాతకర్ణి టీం రెడీ అయిపోతుంది. అలానే ఖైదీ టీం కూడా పోటీ పడుతుంది. ఛానెల్స్ కు, పేపర్స్ కు, వెబ్ సైట్స్ కు ఇలా ఒకరి తరువాత ఒకరు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. నిజానికి ఒకప్పుడు పెద్ద హీరోలు మీడియాను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు అంతా పబ్లిసిటీ మీదే ఆధారపడడం వలన స్టార్ హీరోలు సైతం ఓపిక తెచ్చుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ప్రమోషన్స్ లో పోటీ పడ్డ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు పోటీ పడతారో.. చూడాలి!