‘డియర్‌ కామ్రేడ్‌’ తరువాత పాటపై ప్రోమో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు యువతలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే విభిన్నంగా ప్రచారం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకూ విడుదల చేసిన పాటలకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరో పాటను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, ఏ పాట విడుదల చేయాలన్న దానిపై చిత్ర బృందం తర్జనభర్జనలు పడుతున్న వీడియోను విజయ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘మా కామ్రేడ్‌ గ్యాంగ్‌, మా మలయాళీ సినిమాట్రోగ్రాఫర్‌, ఎడిటర్‌, మా తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌, మా కన్నడ లిల్లీ, తెలుగు డైరెక్టర్‌, కొరియో గ్రాఫర్‌ చివరిగా మీ మనిషి’ అంటూ తర్వాత వచ్చే సాంగ్‌ గురించే చెబుతున్నారని ట్వీట్ చేశారు. ‘కాలేజ్‌ క్యాంపస్‌ అంటేనే ప్రేమ పక్షుల హెవెను’ అంటూ చిత్ర యూనిట్‌ అంతా పాట పాడుతూ హుషారెత్తించింది. ఈ పాటను జూన్‌ 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. జులై 26న ‘డియర్‌ కామ్రేడ్‌’ నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.