తమ్ముడూ.. పవర్ స్టార్ సినిమా పనులు జరుగుతున్నాయి


దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమైపోయాడు. గత ఏడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు హరీష్. ఈ సినిమా 14 రీల్స్ పతాకం పై తెరకెక్కింది. తాజాగా మరోసారి 14 రీల్స్ తో వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు హరీష్. ‘మరోసారి పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అని రామ్ ఆచంట, గోపి ఆచంట ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే పవన్ కల్యాణ్ సినిమా కంటే ముందు ఈ సినిమా చేస్తాడేమో అని కంగారు పడ్డ అభిమానులు హరీష్ కు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఓ అభిమాని “అన్నా.. నువ్వు ఎన్ని సినిమాలైనా చెయి… కానీ నీ తరువాత సినిమా మాత్రం పవర్ స్టార్ తోనే చేయాలి.. ఆ సినిమా రికార్డులు బద్దలుకొట్టాలి” అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఫ్యాన్ పోస్ట్ కి స్పందించిన హరీష్ శంకర్.. “తమ్ముడూ.. ప్రస్తుతం పవర్ స్టార్ సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ వర్క్ నడుస్తోంది. ఏది ఏమైనా నేను నెక్స్ట్ సినిమా చేసేది మాత్రం పవర్ స్టార్ తోనే ఆ తర్వాతే ఏ సినిమా అయినా.. నేను కూడా మీలాంటి అభిమానినే అని మర్చిపోకు తమ్ముడూ” అంటూ రిప్లై ఇచ్చారు. దాంతో పవన్ అభిమానులంతా ఖుషీ అవుతున్నారు.