నాపై కొబ్బరికాయ విసిరితే ఊరుకోను!

హీరోయిన్ గా తాప్సీకు ‘ఝుమ్మందినాదం’ సినిమాతో అవకాశం ఇచ్చారు దర్శకుడు రాఘవేంద్రరావు. అయితే ఆయనపై ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలు దుమారానికి తెరలేపాయి. తన నాభిపై దర్శకుడు అలా కొబ్బరిచిప్పను విసరడం పట్ల ఏం శృంగారం ఉందో తనకు అర్ధం కాలేదని తాప్సీ నవ్వుతూ ఓ షోలో చెప్పుకొచ్చింది. ఆమె ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై మండిపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె తదుపరి సినిమాలు తెలుగులో విడుదల కానివ్వమనే వరకు వెళ్లింది వ్యవహారం. దీంతో తాను ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడలేదని, క్షమాపణలు చెప్పింది. అయితే తాజాగా ఈ విషయంపై నటి అమీజాక్సన్ స్పందించింది. 
‘మీపై అలా కొబ్బరికాయ విసిరితే ఏం చేస్తారని’ మీడియా ఆమెను ప్రశ్నించగా.. దానికి సమాధానమిస్తూ ‘అలా చేయడం భయానకంగా ఉంటుంది. ఇలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను. నాకైతే ఇప్పటివరకు అలాంటి సంధర్భాలు ఎదురవ్వలేదు. ఒకవేళ నిజంగా నాపై ఎవరైనా అలా కొబ్బరికాయ విసిరితే నేనే అదే కొబ్బరికాయ వారిపై విసిరికొడతాను. నేను ఇలా చేస్తానని తెలిసే.. నాతో ఇప్పటివరకు అలా ఎవరు ప్రవర్తించలేదేమో. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మంచి దర్శకులతోనే కలిసి పనిచేశాను. అది నా అదృష్టం’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘2.0’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.