HomeTelugu Newsసైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఫైర్‌

సైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఫైర్‌

11 6
బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. 1999 జాతీయ శిబిరంలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న ఇదే వ్యక్తి హైదరాబాద్‌ను వదలి ప్రకాశ్‌ పదుకొణె అకాడమీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. తన బయోగ్రఫీలోని ‘బిట్టర్‌ రైవల్‌రీ’ అధ్యాయంలో సైనా తన అకాడమీ వీడడం బాధాకరమని గోపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణె తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదని ఆరోపించారు.

గోపీచంద్‌ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) మంగళవారం వివరణ ఇచ్చింది. హైదరాబాద్‌ను వీడాలన్న సైనా నిర్ణయం వ్యక్తిగతమని వెల్లడించింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తను గుత్తా జ్వాల ట్వీట్‌ చేశారు. ‘తప్పు జరిగిందని బాధపడుతున్న ఆ వ్యక్తే ప్రకాశ్‌ సర్‌ శిక్షణ కోసం హైదరాబాద్‌ను వీడారు. ఎవరూ ఈ ప్రశ్న అడగకపోవడం ఆశ్చర్యం!!’ అని వ్యాఖ్యను జత చేశారు.

ఇండియన్‌ ఒలింపిక్‌ డ్రీమ్‌ అనే యూజర్‌ ఒకరు ‘మేడమ్‌, ఎవరూ మొసలి కన్నీరు కార్చడం లేదు. పుస్తకం ఇంకా రాలేదు. బయటకు వచ్చిన విషయమే చదివాను. ఎవరినైనా నేరుగా నిందించొచ్చు! మీరే పక్షమన్నది అనవసరం. గాయపడ్డ సైనా ఒలింపిక్స్‌లో ఆడటం పెద్ద తప్పు. అప్పటి కోచింగ్‌ బృందాన్ని తప్పకుండా ప్రశ్నించాలి’ అని స్పందించారు. దానికి ‘నేనూ ప్రశ్నిస్తున్నాను’ అని జ్వాల బదులిచ్చారు. వెంటనే ఆ యూజర్‌ ‘నిష్పక్షపాతంగా ఉండాలి. మనకు పూర్తి సమాచారం తెలియాలి. పుస్తకం విడుదలైతేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి వార్తలను మనం ఆధారం చేసుకోకూడదు’ అనగా ‘మీరు మర్చిపోతున్నారు. నేనూ జాతీయ శిబిరంలో భాగస్వామినే. 1999లో ఏం జరిగిందో నాకు తెలుసు. ధన్యవాదాలు’ అని జ్వాల పేర్కొన్నారు. ఆమె చేసిన ట్వీట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!