‘కాంచన 3’ లో రాఘవా తన నట విశ్వరూపం చూపించారు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవా లారెన్స్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘కాంచన 3’. ‘ముని’ సిరీస్‌లో భాగంగా వస్తోన్న చిత్రమిది. లారెన్స్‌ ఈ చిత్ర దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఓవియా, వేదిక‌, కోవై స‌ర‌ళ‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మధు తెలిపారు. దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో రూ. కోటి ముప్పయి లక్షలు ఖర్చుపెట్టి ఓ పాటను చిత్రీకరించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ‘కాంచన 3’లో లారెన్స్ తన నట విశ్వరూపం చూపించారు. అంతే కాదు భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో అత్యద్భుతంగా ఓ పాటను షూట్ చేశారు. 400 మంది అఘోరా గెటప్‌లో, 1000 మంది విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారు. 6 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ‘కాంచన 3′ చిత్రం లారెన్స్‌ కెరీర్‌కు ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. లారెన్స్‌ గతంలో వచ్చిన చిత్రాల కంటే కథా బలంతో వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని నా గట్టి నమ్మకం.. ఈ చిత్రంతో లారెన్స్‌ తానెంటో నిరూపించుకుంటారు’ అని అన్నారు.