కూతురు ఎంట్రీపై రాజశేఖర్ ఏమన్నాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసత్వంతో తమ కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ వారి కూతుళ్ళు హీరోయిన్లుగా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. అయితే కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై రాజశేఖర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలా మంది స్టార్లు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేయడానికి అంగీకరిస్తున్నారు కానీ వారి కూతుళ్లను మాత్రం ఇండస్ట్రీకు పరిచయం చేయడానికి ఇష్టపడడం లేదని ఇండస్ట్రీలో హిపోక్రసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. సినిమాల్లో వేరే హీరోయిన్లను టచ్ చేస్తాం, వారితో కలిసి నటిస్తాం కానీ మన ఇంటి అమ్మాయిలను వేరే ఎవరో ముట్టుకుంటే తట్టుకోలేం. ఇండస్ట్రీలో ఇలాంటి ధోరణి ఉందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. 
అలా ఎవరైతే భావిస్తున్నారో.. వారు ఇండస్ట్రీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నట్లే.. నేను మాత్రం అలా ఆలోచించడం లేదు. అందుకే నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. ఆడవాళ్ళు సినిమాల్లోకి వస్తే ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడిప్పుడే అది కాస్త తగ్గుతోంది. నాకు కొడుకు ఉంటే వాడిని హీరోగా పరిచయం చేసేవాడిని. కూతురు పుట్టింది గనుక తనను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే శివాని ఓ తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయబోతుందని సమాచారం.