అనసూయ ‘కథనం’ మూవీ రివ్యూ

బుల్లితెర యాంకర్‌గా ఫేమస్‌ అయిన అనసూయ.. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌ స్టేజ్‌ మీద నవ్వులు పూయించడం కాదు.. వెండితెరపై కనబడి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించగల అనసూయ.. ప్రస్తుతం ‘కథనం’ అనే చిత్రంతో ఈ శుక్రవారం మన ముందుకు వచ్చారు. మరి నటిగా మంచి పేరుగా తెచ్చుకున్న అనసూయకు.. కథనం మరో విజయాన్ని చేకూర్చిందా? లేదా? అన్నది చూద్దాం.

కథ: అను(అనసూయ భరద్వాజ్‌) సినిమా పరిశ్రమలో రచయితగా కథలు రాస్తూ.. డైరెక్షన్‌ చాన్స్‌ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ నలుగురు నిర్మాతల దగ్గర ఉన్న కథను డెవలప్‌ చేసి వారిని మెప్పిస్తుంది. ఆ చిత్రానికి అనసూయను దర్శకుత్వ బాధ్యతలు చేపట్టి.. మిగతా స్క్రిప్ట్‌ వర్క్‌ చేయమని సలహా ఇస్తారు నిర్మాతలు. అయితే ఆ కథకు సంబంధించిన కథనాన్ని ఎలా రాసుకుంటుందో.. నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ హత్యలు చేసేది ఎవరు? దీనికి వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ.

నటీనటులు: అను పాత్రలో అనసూయ లుక్స్‌ పరంగానే కాకుండా నటిగానూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక అరవిందమ్మ పాత్రలో కూడా అనసూయ హుందాతనాన్ని చాటుకుంది. సెకండాఫ్‌లో సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించింది. అనసూయకు వెన్నంటే ఉండి సహాయం చేసే స్నేహితుడి పాత్రలో ధనరాజ్‌, పోలీస్‌ పాత్రలో రణధీర్‌ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ: కథ కొత్తది కాకపోవడం ఈ సినిమాకు మైనస్‌. కథనం అని టైటిల్‌ పెట్టినా.. తన కథనాన్ని మాత్రం చక్కగా నడిపించలేకపోయాడు దర్శకుడు. అయితే అనసూయ కథనాన్ని నడిపించడం.. కాస్త ఊరటనిచ్చే అంశం. అసలు కథను చెప్పడానికి సెకండాఫ్‌ను ఉపయోగించుకున్న దర్శకుడు ఫస్ట్‌ హాఫ్‌ను గాలికొదిలేసినట్లు కనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు, ఇరికించినట్లు అనిపించే కామెడి.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ లైన్‌ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది.

హైలైట్స్‌ :
అనసూయ

డ్రాబ్యాక్స్ :
కథ, కథనం

టైటిల్ : కథనం
నటీనటులు: అనసూయ, ధన్‌రాజ్‌, రణధీర్‌ తదితరులు
దర్శకత్వం : రాజేష్‌ నాదెండ్ల
నిర్మాత : బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా

చివరిగా : పర్వలేదనిపించిన అనసూయ ‘కథనం’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)