ఖుష్బూకు చేదు అనుభవం

సినీ నటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి నేత రిజ్వాన్‌ అర్షద్‌కు మద్దతు తెలిపేందుకు ఖుష్బూ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె తన వాహనం వైపు నడుస్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి ఖుష్బూ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో కోపోద్రిక్తురాలైన ఆమె సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అది గమనించిన పోలీసులు, పార్టీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఆ సమయంలో స్థానిక మీడియా వర్గాలు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి రిజ్వాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.