కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరూ’

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’ ఇచ్చిన విజయంతో దూసుకుపోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సూపర్‌స్టార్’ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘రాజకుమారుడు’ దగ్గరి నుంచి మహేష్‌ నటించిన సినిమా టైటిల్స్‌తో రూపొందించిన వీడియోను కూడా విడుదల చేశారు. సిల్వర్‌జూబ్లీ పూర్తి చేసుకున్న మహేశ్‌ ఈ చిత్రంతో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్‌ చివర్లో తుపాకీ దానిపై సోల్జర్‌ క్యాప్‌ చూస్తుంటే ఇది ఆర్మీ నేపథ్యంతో కూడిన సినిమా అని అర్థమవుతోంది.

‘మహేష్‌ బాబు నటించే 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరూ 2020 సంక్రాంతికి విడుదల’ అంటూ కృష్ణ ప్రకటించారు. ఇక ఇందులో మహేష్‌ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. అవును. నేనొక అద్భుతమైన బృందంలో భాగస్వామిని అయ్యాను. సూపర్‌ కిక్‌లా ఉంది. అంతేకాదు, మహేష్‌బాబు, అనిల్‌ రావిపూడి, దిల్‌రాజు, అనిల్‌ సుంకర, దేవిశ్రీ ప్రసాద్‌లతో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది.