నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి ని మర్చిపోయా: మహేష్‌ బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గురించి వేడుకలో మాట్లాడటం మర్చిపోయానని అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం అట్టహాసంగా జరిగింది. ఎందరో సినీ ప్రముఖులతో వేడుక కళకళలాడింది. ఈ సందర్భంగా తాను నటించిన ఇరవై నాలుగు సినిమాల దర్శకుల గురించి మహేష్‌ స్టేజ్‌పై మాట్లాడారు.

కానీ ‘పోకిరి’ తో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించిన పూరీ జగన్నాథ్‌ గురించి చెప్పడం మర్చిపోయారు. దాంతో ఆయన గురించి ట్విటర్‌ వేదికగా ప్రస్తావించారు. ‘వేడుకలో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయా. నా 25 సినిమాల ప్రయాణంలో ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ను చేసింది. నాకు ‘పోకిరి’లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పూరీ జగన్నాథ్‌గారు. ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’ అని పేర్కొన్నారు.

ఇందుకు పూరీ సమాధానంగా.. ‘ధన్యవాదాలు సర్‌. లవ్యూ. ‘మహర్షి’ ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.