
ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ మహాదీక్ష దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రకుల నాయకులలో మహిళా దృక్పథంలో కుల తత్వం కనిపిస్తోందని ఆరోపించారు. దిశ నిందితుల్లో ముగ్గురు బీసీలు, ఒక ముస్లిం వున్నారని.. దిశ నిందితుల పట్ల ప్రదర్శించిన వైఖరి మిగతా అణగారిన వర్గాల మహిళలను హత్యాచారం చేసిన వారిని శిక్షించడం పట్ల కూడా చూపించాలని మందకృష్ణ మాండ్ చేశారు. దేశంలో 15 సంవత్సరాల్లోనే 3 లక్షల 41 వేల మంది మహిళలపై హత్యాచారం జరిగితే దిశ నిందితులను మాత్రమే ఎందుకు ఎన్ కౌంటర్ చేశారని ప్రశ్నించారు.
దిశ విషయంలో పోలీసులకు రహస్య ఆదేశాలు అందాయని అందుకే వారు ఎన్ కౌంటర్ చేశారని ఆరోపించారు. ఈ ఎన్ కౌంటర్ లో అనేక అనుమానాలు ఉన్నాయని దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను అభినందించిన ఏపీ ప్రభుత్వం.. గుంటూరులో ఐదేళ్ల చిన్నారి పైన హత్యాచారం చేసిన వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయించలేదని ప్రశ్నించారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చిన రోజే ప్రకాశం జిల్లాలో ఒక మహిళ పై అత్యాచారం, హత్య జరిగిందని అన్నారు. ఏపీలో 70 శాతం హత్యాచారాలకు కారణం ఒక్క సామాజిక వర్గమేనని ఆరోపించారు.













