నాయకుడు బెదిరిస్తున్నాడంటున్న కంగనా


బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టొద్దన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ స్పందించారు. సంజయ్‌ రౌత్‌ బెదిరింపుల నేపథ్యంలో ముంబై నగరం తనకు ఇప్పుడు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లా కనిపిస్తోందని కంగనా అంటోంది. ముంబై వీధుల్లోని గోడలపై ఇప్పటి వరకు ఆజాదీ రాతలను చూశామని, ఇప్పుడు బహిరంగ బెదిరింపులను చూస్తున్నామని కంగనా మండిపడింది.

అంతకుముందు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై పార్టీ పత్రిక సామ్నాలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎండగట్టారు. ముంబై నగరంలో ఉంటూనే ముంబై పోలీసులపై కంగనా సందేహం వ్యక్తం చేస్తున్నారని తప్పుపట్టారు. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నాలో ఆయన రాసుకొచ్చారు. దీనిపై హోంశాఖ చర్యలు తీసుకోవాలన్నారు.

సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల పనితీరును గతంలోనూ పలుమార్లు కంగనా ప్రశ్నించారు. సుశాంత్‌ మృతి అనంతరం బాలీవుడ్‌లో బంధుప్రీతి, స్టార్‌ కిడ్స్‌ను ప్రోత్సహించే సంస్కృతిపై కంగనా పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం మామూలేనని కంగనా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. నార్కోటిక్స్‌ బ్యూరో విచారణ చేపడితే బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు జైలు ఊచలులెక్కపెడతారని ఆమె వ్యాఖ్యానించారు.

CLICK HERE!! For the aha Latest Updates