నాగినిపై నెటిజన్ల మండిపాటు

నాగిని సీరియల్‌ నటి, బాలీవుడ్‌ కథానాయిక మౌనీ రాయ్‌ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ సినిమా “భారత్‌” ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఫొటోలను చూసిన పలువురు ట్రోలర్స్‌.. మౌనీరాయ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలతో తన సహజ అందాన్ని పాడు చేసుకుందని, మరింత అందం కోసం చేయించుకున్న సర్జరీలు సక్సెస్‌ కాకపోవడంతో ఆమె వికారంగా తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే ప్లాస్టిక్‌ సర్జరీల కారణంగా మౌనీరాయ్‌.. రాఖీ సావంత్‌లా కనిపిస్తోందని, మైఖేల్‌ జాక్సన్‌లా మారిందని కామెంట్లు పెడుతున్నారు.

నియాన్‌ గ్రీన్‌ జాకెట్‌, బ్లాక్‌ డ్రెస్‌ వేసుకొని భారత్‌ ప్రీమియర్‌ ఈవెంట్‌కు క్యాజువల్‌గా హాజరయింది మౌనీ రాయ్‌. లుక్‌పరంగా ఆమె పెదవులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె ఫొటోలపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలు ఆమె అందాన్ని నాశనం చేశాయని, మీ పెదవులకు ఏమైంది.. సర్జరీ ఫెయిలైందా? సహజ అందగత్తె అయిన మౌనీరాయ్‌ తన అందంపై నమ్మకం లేకనే.. ఇలా సర్జరీలు చేయించుకుంటోందని ట్రోలర్స్‌ రెచ్చిపోతున్నారు. అయితే, తన ఫొటోలపై వ్యక్తమవుతున్న నెగటివ్‌ కామెంట్లపై మౌనీరాయ్‌ ఇంతవరకు స్పందించలేదు.