‘నాలో మైమరపు..’ అంటున్న సమంత ‘ఓ బేబీ’

‘నాలో మైమరపు నాకే కను సైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగెందుకంటే ఎలా..’ అంటూ మైమరచిపోతున్నారు స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఆమె నటించిన సినిమా ‘ఓ బేబీ’. ఈ సినిమాలోని రెండో పాటను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. సామ్‌, నాగశౌర్యలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ ప్రేమ గీతం అందరికీ నచ్చుతుందని సామ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ఈ పాట షూట్‌ను చాలా ఎంజాయ్‌ చేశానని నాగశౌర్య అన్నారు. ‘ఇలా ఈ క్షణం శిలై మారితే లిఖించాలి ఈ జ్ఞాపకం..’ అంటూ సాగే ఈ గీతాన్ని మోహనా భోగరాజు చక్కగా ఆలపించారు. మిక్కీ జే మేయర్‌ పాటకు సంగీతం అందించారు.

‘ఓ బేబీ’ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మి, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అడివి శేష్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 2014లో వచ్చిన కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’ కి రీమేక్‌ ఇది. జులై 5న సినిమా విడుదల కాబోతోంది.