నాగబాబు ‘జబర్దస్త్‌’ మానేస్తారా?

బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో ‘జబర్దస్‌’. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ షోకి న్యాయనిర్ణేతలుగా సినీ నటులు నాగబాబు, రోజాలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు జనసేన పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా, ఈ సందర్భంగా ‘రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ‘జబర్దస్త్’ షో చేస్తారా.. లేక మానేస్తారా’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇచ్చారు.

‘ఏపీ ఎన్నికల రోజున సర్వేలో భాగంగా నేను ఓ పోలింగ్‌ బూత్‌కు వెళ్లాను. అక్కడ ఒక పెద్దావిడ.. ‘ఏమయ్యా.. నువ్వు ఎంపీ అయితే, ‘జబర్దస్త్‌’ మానేస్తావా?. నువ్వు మానేస్తానంటే ఒప్పుకొనేది లేదు.’ అని అన్నారు. ‘జబర్దస్త్‌’ అనేది ఒక సర్వీస్‌లాంటింది. అయితే, ఇది పెయిడ్‌ సర్వీస్‌. వినోదాన్ని పంచుతూ నాకు కొంత ఆదాయాన్ని ఇస్తోంది. దాని కంటే ప్రజల్ని నవ్వించే ఒక షోలో భాగం కావడం నాకు నచ్చింది.. గుర్తింపు తెచ్చింది. నేను ఈ షోకు కేటాయించేది నాలుగైదు రోజులు. ఒక వేళ నేను ఎంపీగా ఎన్నికైనా కూడా నాకు ఎటువంటి నష్టం జరగదు. ప్రజలకు చేరువకావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కచ్చితంగా ఈ షో చేస్తా. అయితే, సినిమాల్లో మాత్రం నటించలేకపోవచ్చు. ప్రజలకు నచ్చిన షో కాబట్టి తప్పకుండా చేస్తా. ఇది కొనసాగుతుంది.’ అని అన్నారు.

అదే విధంగా ఇటీవల ‘రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా’ అని శివాజీరాజా చేసిన వ్యాఖ్యలపై కూడా నాగబాబు సమాధానం ఇచ్చారు. ‘నేను ఎంపీ స్థాయిలో రాజకీయాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆ స్థాయి వాటికి స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ప్రశ్నను చాలా మంది అడిగారు కాబట్టి చెబుతా. శివాజీరాజా ఒకసారి ‘మా’ ప్రెసిడెంట్‌గా చేశారు. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తే, మంచి ఆలోచనలతో వస్తారని నరేష్‌కు ఓటు వేయమని నాకు తెలిసిన వారికి చెప్పానంతే. అయితే, నరేష్ కంటే కూడా శివాజీరాజాతోనే నాకు అనుబంధం ఎక్కువ. జీవితా రాజశేఖర్‌ నాకు పలుసార్లు ఫోన్‌ చేసి, మద్దతు కోరారు. శివాజీరాజా కూడా ఫోన్‌ చేసి, ‘కలుద్దాం’ అన్నారు కానీ, కలవలేదు. కేవలం కొత్తవారికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే నరేష్‌ ప్యానల్‌కు మద్దతుగా నిలిచా. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా ఎలాంటి వ్యతిరేకత లేదు’ అని చెప్పుకొచ్చారు.