సింబా పాత్రకు నాని గొంతు!

యంగ్‌ హీరో నాని గర్జించబోతున్నారు. అవును! ఇది నిజమే! ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ది లయన్‌ కింగ్’‌. 1994లో చిన్నా పెద్దా అందరినీ అలరించిన యానిమేషన్‌ చిత్రం ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారిప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సింబా పాత్రకు తెలుగులో నాని గొంతు అరువిచ్చారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఇక సింబా తండ్రి పాత్ర ముఫాసాకు రవిశంకర్‌, విలన్‌ పాత్ర స్కార్‌ జగపతిబాబు, ‘పుంబా’ అనే అడివి పందికి బ్రహ్మానందం, ‘టిమోన్‌’ అనే ముంగిసకి ఆలీ డబ్బింగ్‌ చెప్పారు. ‘ది జంగిల్‌ బుక్‌’, ‘ఐరన్‌మ్యాన్‌’ చిత్రాల దర్శకుడు జాన్‌ ఫేవరోవ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అన్నట్లు ‘అ!’ సినిమాలో చేప పాత్రకు నాని డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

హిందీలో ముఫాసా పాత్రకు షారుఖ్‌, సింబా పాత్రకు ఆయన తనయుడు ఆర్యన్‌ గొంతు అరువిచ్చారు. అదే విధంగా తమిళంలో సింబా పాత్రకు సిద్ధార్థ్‌, స్కార్‌ పాత్రకు అరవిందస్వామి డబ్బింగ్‌ చెప్పారు. ‘లయన్‌ కింగ్‌’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.