బుల్లితెరపై లేడీ సూపర్‌స్టార్‌!

ఒకప్పుడు ప్రముఖ నటీనటులు బుల్లితెరపై నటించడానికి వెనుకాడేవారు. బుల్లితెర తారలు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అలాంటి వెనుకాడటాలేం లేవు. నిజానికి వెండితెర స్టార్స్‌ బుల్లితెరపైకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడు కమలహాసన్, విశాల్, విజయ్‌సేతుపతి, నటి వరలక్ష్మి వంటి ప్రముఖ స్టార్స్‌ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షులను అలరిస్తున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ , లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. అదేంటి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార బుల్లితెరపైకి రావడం ఏమిటీ అని ఆశ్చర్య పోతున్నారా? నిజమే హీరోయిన్‌గా బిజీబిజీగా ఉన్న నయనతార మణిరత్నం చిత్రాన్నే వదిలేసుకున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయినా ఈ సంచలన నటి బుల్లితెరపైకి రావడం షురూ అంటున్నారు.

దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కలర్స్‌ చానల్‌ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ చానల్‌లో ఏ కార్యక్రమంలో నయనతార పాల్గొనబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచారు. ఈ చానల్‌లో ప్రసారం కానున్న ఒక డాన్స్‌ కార్యక్రమానికి నటి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక డాన్స్‌ కార్యక్రమానికి రెండు జట్లకు ఇద్దరు అతిథులు ఉంటారు. అయితే ఆ డాన్స్‌ కార్యక్రమానికి వారానికి ఒక కొత్త అతిథి పాల్గొంటారని, అలా ఒక వారంలో నటి నయనతార గెస్ట్‌గా పాల్గొనబోతున్నారని టాక్‌. సాధారణంగా తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనని నయనతార ఇప్పుడు బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటే ఆమె అభిమానులకు ఆసక్తిగానే ఉంది. ఇంతకీ ఏ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతోన్నారనే వారు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌తో కలిసి దర్బార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈమె నటించిన కొలైయుధీర్‌ కాలం చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.