ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం!

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటించిన ‘న్యూటన్’ చిత్రం నామినేట్ అయిందని అధికార ప్రకటన వచ్చింది. విదేశీ కేటగిరీలో ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డ్ కు ఈ సినిమా పోటీపడబోతుంది. పలు భారతీయ చిత్రాలు ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీ పడగా వాటిలో ‘న్యూటన్’ చిత్రాన్ని బెస్ట్ చిత్రంగా ఎంపిక చేసింది కమిటీ. అయితే అమెరికా
మినహా ఇతర విదేశీ సినిమాలతో పోటీ పడి ఈ సినిమా అవార్డ్ ను గెలుచుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న.

ఓ గవర్న్మెంట్ క్లర్క్, నక్సల్స్ ప్రభావితం అయిన ఛత్తీస్ ఘడ్ లోని ఒక ప్రాంతానికి ఎలెక్షన్ డ్యూటీకి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సమకాలీన రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంలా ఉంటుంది ఈ సినిమా. ఇంతవరకు భారతీయ సినిమాలు ఏవి కూడా ఈ కేటగిరీలో అవార్డును సంపాదించలేకపోయాయి. మరి ఆ లోటుని ఈ సినిమా భర్తీ చేస్తుందేమో చూడాలి. తాను న‌టించిన సినిమా.. ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు రాజ్‌కుమార్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశాడు!