ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోలేదు!

నందమూరి బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించిన కొన్ని రోజులకు రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా ఎన్నుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే సడెన్ గా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపించడం మొదలుపెట్టాయి. బాలయ్య వరుసగా సినిమాలు అంగీకరించడం, ఎక్కడా కూడా బయోపిక్ ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇక ఈ బయోపిక్ ను పక్కన పెట్టేశారని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టలేదని తెలుస్తోంది.
దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది. తాజాగా బాలకృష్ణ చెన్నైకు వెళ్ళి అక్కడ కొంతమంది దర్శకనిర్మాతలతో చర్చించి కథకు కావల్సిన కొన్ని విషయాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ వెల్లడించాడు. నిన్న జరిగిన ‘పైసా వసూల్’ ఆడియో సక్సెస్ మీట్ లో బాలయ్య ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ‘చెన్నై వెళ్ళాను. అక్కడ కొంతమంది నిర్మాతలతో మాట్లాడా.. కంచుకోట, పెత్తందార్లు సినిమాలు చేసిన నిర్మాతలతో నాన్న గారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొచ్చా’ అంటూ హింట్ ఇచ్చేశాడు. సో.. అభిమానులు బెంగ పడాల్సిన అవసరం లేదన్నమాట.