గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయాలి: పవన్‌ కల్యాణ్‌


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కొన్ని వేల మంది జనం బయటికి వచ్చి రేషన్‌ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి రేషన్‌ సరకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. దాని ప్రకారం గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి.. జనం రోడ్ల మీదకి రాకుండా చూడాలి అని ఆయన అన్నారు. ఇలాంటి కష్టకాలంలో తమ పనిని మరింత బాధ్యతతో కష్టపడి చేస్తారని ఆశిస్తున్నా’ అని పవన్‌ పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ని విజయవంతం చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు పవన్‌ కల్యాణ్‌.