ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు: పవన్ కళ్యాణ్

శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ సంచలనాత్మక ఆరోపణ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని, ఒక్క ఓటమి తమ పార్టీని నిలువరించబోదన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు.

‘నా జీవితం రాజకీయాలకు అంకితం. మళ్లీ చెబుతున్నా… నా శవాన్ని నలుగురు మోసుకువెళ్లే వరకు నేను జనసేనను మోస్తా. నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని. 25 సంవత్సరాల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఓటమి ఎదురైతే తట్టుకోగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించా’ అని పవన్‌ చెప్పారు. ఈవీఎంల అక్రమాలు, ధన ప్రలోభం వంటివి తాజా ఓటమికి కారణాలుగా చెబుతున్నారని, వీటన్నింటినీ తాను పట్టించుకోబోనని పేర్కొన్నారు. వైసీపీ పాలన ఎలా ఉంటుందో చూద్దామని అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ జనసేన గుర్తు కనబడాలని, ప్రజలకు మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని చెప్పారు. ‘మీరు ఉంటారా వెళ్లిపోతారా అని సమీక్షకు వచ్చిన ప్రతి అభ్యర్థిని నేను అడుగుతున్నాను. వెంట ఉండేందుకే ఇక్కడి వరకు వచ్చామని వారు చెబుతున్నారు. ఇంతకుమించిన విజయం ఏం కావాలి? ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటపడుతుంది. ఓటమి ఎదురైనప్పుడే అవతలివారు మనవారా? పరాయివారా అన్న విషయం అర్థమవుతుంది. ఈ పార్టీ కార్యాలయం అందరిదీ. ఎవరు ఎప్పుడయినా రావచ్చు. అందరినీ కలిసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తాను’ అని వివరించారు. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులతోను పవన్‌ సమావేశమయ్యారు. జిల్లాల వారీగా అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చించారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో జనం సమస్యలపై సమగ్ర అవగాహనకు రావాలని ఉద్బోధించారు. పంచాయతీ, జడ్పీ, పురపాలక ఎన్నికల్లో దీటుగా పోరాడదామన్నారు.