సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ పై పవన్‌ ప్రశంసలు

ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ సినిమాను వీక్షించారు. విజయవాడలో ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసుకుని మంగళవారం సాయంత్రం పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కుటుంబంతో కాసేపు గడిపి ‘చిత్రలహరి’ సినిమాను వీక్షించారు.

సినిమా తనకు చాలా నచ్చిందని ఓ పేపర్‌పై రాసి బొకేలను ‘చిత్రలహరి’ బృందానికి పంపించారు. ‘కంగ్రాట్స్‌.. మీరు తీసిన సినిమాను నేను బాగా ఎంజాయ్‌ చేశాను’ అని అందులో పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మంచి స్క్రిప్ట్‌ను ఎంపికచేసుకున్నాడంటూ ప్రశంసించారు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ధరమ్‌తో కొన్ని రోజుల క్రితం పవన్‌ ఓ మాట చెప్పారట. ‘ఖుషి’ తర్వాత మంచి విజయం కోసం నేను కూడా చాలా ఏళ్ల పాటు ఎదురుచూశాను’ అని ధరమ్‌తో చెప్పినట్లు చిత్రవర్గాలు తెలిపాయి.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘చిత్రలహరి’ బృందాన్ని మెచ్చుకున్నారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటించారు. సునీల్‌, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.