గుండెల్ని పిండేస్తున్న అరవింద సమేత ‘పెనివిటి’ సాంగ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇటీవల ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేసిన చిత్ర బృందం ఈ రోజు (బుధవారం) ‘పెనివిటి’ అని సాగే రెండో పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రారంభంలో ‘నువ్వు కడుపున పడినాకే మీ అమ్మను గెలిసేసినాను అనుకున్నాడో ఏందో.. దాన్ని వంటింటిలో వదిలేసి వరండాలోకి పోయి ఊరిని గెలసటం మొదలు పెట్టినాడు..’ అంటూ తారక్‌ తల్లి కష్టాన్ని వర్ణిస్తున్నారు ఆయన‌ బామ్మ. భర్త రాక కోసం ఎదురుచూస్తూ, బాధపడుతున్న భార్య మనసును తెలిపేలా ఈ పాట సాగింది. కాల భైరవ ఈ పాటను ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి పాటకు సాహిత్యం అందించారు. ‘నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిశాను. నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిశాను. ఒంటెద్దు బండెక్కి రారా.. సిగిలేటి డొక్కల్లో పదిలంగా రారా.. నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా… పెనివిటి ఎన్నినాళ్లైందో నిను సూసి కనులారా.. నువ్వు కన్న నలుసునైనా తలసి తలసి రారా పెనివిటి’ అంటూ భావోద్వేగంతో సాగే ఈ పాట ఆకట్టుకుంది.