పెళ్ళికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన రజనీకాంత్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య.. ఇటీవల సినీ నటుడు విశాకన్‌ వనగమూడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన వారందరికీ తలైవా పేరుపేరునా ధన్యవాదాలు చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘పెళ్లికి వచ్చి అమ్మాయిని, అల్లుడిని ఆశీర్వదించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, ఇతర మంత్రులకు, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, ముఖేశ్‌ అంబానీ దంపతులు, కమల్‌ హాసన్‌, ఇతర సినీ ప్రముఖులు, పోలీసులు, విలేకర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. వివాహం జరిగిన రోజునే సాయంత్రం గ్రాండ్‌గా విందును ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ నటి కాజోల్‌, నిర్మాత బోనీ కపూర్‌, మోహన్‌బాబు కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఇటీవల ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా త్వరలో ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించబోయే చిత్రంలో నటించనున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రజనీకి జోడీగా కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.