‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ షూట్‌ షూరు!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా సందడి షురూ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభించినట్లు జక్కన్న వెల్లడించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో సెట్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. అందులో రాజమౌళికు ఇరువైపుల హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కూర్చుని ఉన్నారు. ముగ్గురూ చాలా ఉత్సాహంగా కనిపించారు. వారి వెనుక ఉన్న సెట్‌ను చూస్తుంటే భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఆర్‌ ఆర్ ‌ఆర్’ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు.‌ ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ మూవీకి పనిచేస్తున్నారు. ఆయన గతంలో రాజమౌళితో కలిసి ‘సై’, ‘బాహుబలి’ సినిమాలకు పనిచేశారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కు ఆయన సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా బెస్ట్ విషెస్‌ తెలిపారు. ‘నా ప్రియమైన మిస్టర్‌ సీకి.. ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి రోజు షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు, అని ఆమె పేర్కొన్నారు.