పోలీసుల్ని తిట్టి.. ఐదు వాహనాల్ని ఢీ కొట్టిన నటి పై కేసు నమోదు

నటి రూహిసింగ్‌పై కేసు నమోదైంది. ఆమె మద్యం సేవించి, పార్కింగ్‌లో ఆగి ఉన్న ఐదు వాహనాల్ని ఢీ కొట్టడమే కాకుండా పోలీసుల్ని తీవ్రంగా దూషించారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇలా తప్పుగా ప్రవర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్టీకి తన స్నేహితులు రాహుల్‌, స్వప్నిల్‌తో కలిసి వెళ్లిన రూహీ తిరిగి సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో బాంద్రా లింకింగ్‌ రోడ్డు ఓ హోటల్‌ వద్ద ఆగారు. కానీ అది క్లోజింగ్‌ టైమ్‌ అని సిబ్బంది చెప్పడంతో కోపంతో గొడవకు దిగారు. తర్వాత సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేశారు. ముంబయి పోలీసులు హోటల్‌కు చేరుకోగా.. వారితోనూ ముగ్గురూ అలానే ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రాహుల్‌, స్వప్నిల్‌ను అక్కడికక్కడే అరెస్టు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయకూడదనే నిబంధన ఉండటం వల్ల రూహిని అరెస్టు చేయలేదు.

దీన్ని పక్కన పెడితే రూహి ఇంటికి వెళ్తూ పార్కింగ్‌లో ఉన్న ఐదు వాహనాల్ని ఢీ కొట్టారు. ‘శాంతాక్రూజ్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, ఆమె మద్యం సేవించారా? లేదా? అని పరీక్షించడానికి మెడికల్‌ శాంపిల్స్‌ తీసుకున్నారు. అప్పటికే ఆమె మరో కేసులో బుక్‌ అయ్యారు. కానీ అరెస్టు చేయలేదు. ఆమె మెడికల్‌ రిపోర్టు వచ్చింది.. మద్యం తాగారని తేలింది’ అని అదనపు పోలీసు కమిషనర్‌ మనోజ్‌ కుమార్‌ శర్మ మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. రూహి ‘క్యాలెండ్‌ గర్ల్స్‌’, ‘ఇష్క్‌ ఫరెవర్‌’ వంటి సినిమాలతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లలో నటించారు.