ఆ కారణంగానే రూ.2 కోట్ల డీల్‌ వదిలేశా: సాయిపల్లవి

హీరోయిన్‌ సాయిపల్లవి రూ.2 కోట్ల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఆఫర్‌ను వద్దనుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు మేకప్‌ వేసుకోని తను.. సదరు ఉత్పత్తుల సంస్థకు ప్రచారకర్తగా ఉండటం సరికాదని ఆమె భావించినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఇదే ప్రశ్నను మీడియా తాజా సమావేశంలో సాయిపల్లవిని అడిగింది. దీనికి ఆమె స్పందిస్తూ.. మహిళలకు తప్పుడు సందేశాన్ని ఇవ్వలేక రూ.2 కోట్ల ఆఫర్‌ వద్దు అనుకున్నట్లు చెప్పారు. అలాగే ఓ సంఘటన వివరాలను వెల్లడించారు.

నా చెల్లి పూజ చీజ్‌ బర్గర్లు బాగా తింటుంది. తన కంటే నా చర్మం రంగు కాంతివంతంగా ఉందని ఎప్పుడూ అంటుంటుంది. ఇద్దరం అద్దం ముందు ఉన్నప్పుడు నాతో తనను పోల్చుకుంటుంది. అప్పుడే తనతో ఓ మాట చెప్పా. నువ్వు ఇంకా రంగు రావాలి అనుకుంటే.. పండ్లు, కూరగాయలు బాగా తిను అన్నా. ఇలాంటివి తినడం తనకు ఇష్టం లేదు. కానీ వాటినే ఆహారంగా ఇప్పటికీ తీసుకుంటోంది. నాకు ఎందుకో బాధగా అనిపించింది. చర్మం రంగు.. నా కన్నా ఐదేళ్లు చిన్న అమ్మాయిపై ఇంత ప్రభావం చూపించిందా? అనుకున్నా’ అని ఆమె అన్నారు.

ఫెయిర్ నెస్‌ క్రీమ్‌కు ప్రచారకర్తగా ఉండటం గురించి మాట్లాడుతూ.. ‘ప్రకటనలో నటిస్తే వచ్చే డబ్బుల్ని నేను ఏం చేసుకుంటాను? ఇంటికి వెళ్లి మూడు చపాతీలు లేదా అన్నం తింటాను. నాకు దీనికి మించిన అవసరాలు ఏమీ లేవు. దీని ద్వారా నేను ప్రజల సంతోషం కోసం ఏమైనా చేయగలనా. మన ఆలోచనలు సరిగా లేవనేది నా అభిప్రాయం. ఇది భారతీయుల రంగు‌. మనం విదేశాలకు వెళ్లి, మీరెందుకు ఇంత తెల్లగా ఉన్నారని అడగలేం. ఎందుకంటే.. ఆ రంగు వల్ల క్యాన్సర్‌ వస్తోందని వారికి కూడా తెలుసు. అది వారి చర్మం రంగు, ఇది మనది అంతే’ అని సాయిపల్లవి పేర్కొన్నారు.