థియేటర్‌కు వెళ్లి చూస్తే రూ.300 కోట్లు వస్తాయి!

ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి ‘భారత్’ చూస్తే తప్పకుండా రూ.300 కోట్లు వస్తాయని బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భారత్‌’. కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌లు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్‌ 5న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు అంచనాలు పెంచాయి. సాధారణంగా సల్మాన్‌ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లు రాబట్టినా.. దాన్ని హిట్‌గా భావించరు. ఈ నేపథ్యంలో ‘భారత్’ రూ.300 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

ఇలా ముందుగానే భారీగా అంచనా వేయడం పట్ల ఒత్తిడిగా ఫీల్‌ అవుతున్నారా? అని మీడియా సల్లూభాయ్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘రూ.300 కోట్లు రావాలని మీరు ఆశిస్తే, అంచనా వేస్తే.. థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. ఇంట్లో కూర్చుని చూడొద్దు. డిజిటల్‌లో చూద్దాం, పైరసీ కాపీ చూద్దాం, కొన్ని రోజుల తర్వాత టీవీలో చూద్దాం అనుకోకుండా వెళ్లి థియేటర్‌లో చూడండి. అప్పుడు మీరు ఆశించిన ఆ వసూళ్లు వస్తాయి. రూ.340 కోట్లు ఏంటి, రూ.640 కోట్లు కూడా వస్తాయి’ అని అన్నారు.