చైతు ఛాన్స్ సందీప్ కొట్టేశాడు!

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతోన్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో సందీప్ కిషన్ కి మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్య ఆయన సక్సెస్ రేట్ బాగా తగ్గింది. తెలుగులో మార్కెట్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ‘రన్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలు నిరాశ పరిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని తమిళంలో చేసిన ‘మానగరం’ అక్కడ సక్సెస్ ను సాధించినా, తెలుగులో నిరాశ పరిచింది. దాంతో ఆయన కృష్ణవంశీ ‘నక్షత్రం’సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో ’16’ సినిమాతో హిట్ కొట్టిన కార్తీక్ నరేన్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను తెలుగులోను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగచైతన్యను అనుకున్నారు. కానీ చైతు హ్యాండ్ ఇవ్వడంతో రెండు భాషలకు తగ్గ నటుడ్ని తీసుకోవాలనుకొని సందీప్ ను ఎన్నుకున్నారు. ఈ సినిమాతో తనకు సక్సెస్ దక్కుతుందనే నమ్మకంతో సందీప్ ఉన్నాడు.