వెండితెరపై మరోసారి సంగీత.. ఏ సినిమానో తెలుసా!

ఖడ్గం సినిమాలో ‘ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సంగీత తమిళంలోనూ పలు హిట్లను అందుకున్నారు. సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వైవాహిక జీవితానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత బుల్లితెరలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై మళ్లీ కనిపించనున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ బ్యానరుపై కౌసల్య రాణి నిర్మాణంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘తమిళరసన్‌’ సినిమాలో సంగీత కీలకపాత్ర పోషిస్తున్నారు. దీని గురించి సంగీత మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. వాటిలో చాలా పాత్రలు నాకు నచ్చనందున అంగీకరించలేదు. చాలా అవకాశాలను పక్కన పెట్టేశా. అయితే తమిళరసన్‌లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషిస్తున్నా. అతిపెద్ద ఆస్పత్రిని నడిపే ఎండీగా ఇందులో నటిస్తున్నా. చాలా పవర్‌ఫుల్‌గా ఈ పాత్రను తీర్చిదిద్దారు. ఇందులో నటిస్తున్నప్పుడు ఇంకా ఆసక్తి పెరుగుతోందని’ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. విజయ్‌ ఆంటోనికి జోడీగా రమ్యా నంబీశన్‌ నటిస్తోంది.