మరోసారి హీరోగా సప్తగిరి


టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సప్తగిరి తక్కువ కాలంలోనే మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్తూరు యాస, టైమింగ్ కామెడీతో తనకంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా మారాడు. 2017లో సప్తగిరి ఎల్ఎల్‌బి అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తూనే హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సప్తగిరి హీరోగా న‌టిస్తోన్న మూడో సినిమా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వంలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉందని కొనియాడారు.

జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సప్తగిరి కామెడీ రైడ్‌తో పాటు ప్రేక్షకులకు నచ్చే మాస్ అంశాలను ఇందులో మేళవించారు. సప్తగిరి చెప్పే కామెడీ డైలాగుల్లో టైమింగ్ కూడా బాగా కుదిరింది. గోవింద అనే దొంగ పాత్రలో సప్తగిరి నటించారు. తన లక్ష్యం కోసం ఒక ఊరిలోని ప్రజలను నమ్మించడానికి గోవింద ప్రయత్నిస్తాడు. తన వేషాన్ని మార్చుకుంటాడు. ఈ వేషంలో కామెడీని పండించాడు. రామ్మా చిలకమ్మా రకుల్‌తో నా పెళ్లమ్మా.. ప్రేమా మొలకమ్మా వరి విత్తనాలు మొలకలొచ్చేంత వరకు కొడతానమ్మా అనే డైలాగ్ ఫన్నీగా ఉంది.

ఇక ఈ సినిమాలో సప్తగిరి ఫైట్లు, డ్యాన్స్‌లు, ఫీట్లతో అదరగొట్టినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమైపోతోంది. ఒక మంచి మాస్ మసాలా కమర్షియల్ మూవీని సప్తగిరి తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్ చివరిలో రజినీకాంత్ స్టైల్లో సప్తగిరి చెప్పే డైలాగ్ హైలైట్. ఇదే లాస్ట్ సిగరెట్టు, ఇదే లాస్ట్ పెగ్గు అన్న మగాడి మాట.. ఇదే లాస్ట్ షాపింగ్ అన్న ఆడవాళ్ల మాట జనాలు నమ్మినట్టు చరిత్రలోనే లేదు అనే డైలాగ్‌ను సప్తగిరి చాలా ఈజ్‌తో చెప్పారు.