‘సైరా’ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేసే సెట్స్ అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సైరా విడుదల ఎప్పుడు అనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేస్తారని కొందరు, లేదు దసరాకు వస్తుందని కొందరు.. కాదు కాదు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని కొన్ని వార్తలు వచ్చాయి.

వీటికి చెక్ పెడుతూ సైరా రిలీజ్ డేట్ వచ్చింది. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు. మిగిలిన కొద్దిపాటి షూట్ ను కంప్లీట్ చేసి, నిర్మాణాంతర కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నది యూనిట్. మెగాస్టార్ తో పాటు అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు.