తనుశ్రీకి ఆ ఆలోచన లేదంట!

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా తనకు ‘బిగ్‌బాస్‌’కు వెళ్లే ఆలోచన లేదని అంటున్నారు . ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్‌ 12కు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘బిగ్‌బాస్‌’ షో మొదలుకావడానికి కొన్ని రోజుల ముందు తనుశ్రీ తన పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సల్మాన్‌ బిగ్‌బాస్ షోలో అవకాశం ఇస్తారన్న ఆలోచనతోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ విషయం గురించి తనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను అవమానపరచడానికి కొందరు అలా మాట్లాడుతున్నారు. ‘బిగ్‌బాస్’ ఏమైనా స్ఫూర్తిని కలిగించే కార్యక్రమమా? సల్మాన్‌ ఖాన్‌ దేవుడని, బిగ్‌బాస్‌ స్వర్గమని మీరు అనుకుంటున్నారా? నేను మాత్రం అలా అనుకోవడంలేదు. గత కొన్నేళ్లలో 11 సీజన్లు జరిగాయి. బిగ్‌బాస్‌లో పాల్గొనమని, కోట్ల రూపాయలు ఇస్తామని నిర్వాహకులు నన్ను వేడుకున్నారు. కానీ, నేను రానని తెగేసి చెప్పాను. నేను క్లాస్ట్రోఫోబియా(ఒకే గదిలో ఎక్కువ మందితో కలిసి ఉన్నప్పుడు కలిగే భయం)తో బాధపడటం లేదు. నాకంటూ కొన్ని పనులుంటాయి. వాటి కోసం తిరుగుతూ ఉండాలి.’ అని తెలిపారు.