రివ్యూ: వంగవీటి

నటీనటులు: సందీప్ కుమార్, వంశీ చాగంటి, కౌటిల్య, శ్రీతేజ్ నైనా గంగూలీ తదితరులు..
సంగీతం: రవి శంకర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, దిలీప్ వర్మ, సూర్య చౌదరి
ఎడిటింగ్: సిద్ధార్థ రాతోలు
రచన: చైతన్య ప్రసాద్, రాధా కృష్ణ
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
వంగవీటి రాధా, చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో విజయవాడలో రౌడీయిజం మొదలైంది. వంగవీటి రంగాని చంపడంతో ఆ రౌడీయిజం ఎంతవరకు ఆగిందో.. చెప్పే కథే ‘వంగవీటి’. వంగవీటి పేరుతోనే రౌడీయిజం మొదలైందని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఈసారి అదే టైటిల్ ను పెట్టి యధార్థ సంఘటనల ఆదారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
విజయవాడలో వంగవీటి రాధా(సందీప్ కుమార్) అనే వ్యక్తి బస్టాండ్ రాధాగా ఎదుగుతున్నాడని తెలిసి వెంకటరత్నం అనే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ రాధాను పిలిపించి మాట్లాడతాడు. విజయవాడలో తన పవర్ ను చూపించాలంటే వెంకటరత్నం లాంటి నాయకుడి సపోర్ట్ అవసరమని భావించిన రాధా ఆయన అండర్ లో పనిచేయడానికి అంగీకరిస్తాడు. అయితే రాను రాను రాధా చేసే పనుల వలన తనకంటే రాధా గొప్పగా ఎదిగిపోతాడని భావించిన వెంకటరత్నం అతడికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాధా, తన మనుషులతో కలిసి వెంకటరత్నాన్ని చంపాలని ఫిక్స్ అవుతాడు. అనుకున్న పనిని అమలు చేస్తాడు. వెంకటరత్నం చావుతో అప్పటివరకు ఉన్న రాధా క్రేజ్ మరింత పెరిగిపోతుంది. విజయవాడలో తను చెప్పేదే శాసనం అన్నట్లుగా అందరూ వ్యవహరించేవారు. అదే సమయంలో రాధాను గాంధీ(కౌటిల్య), నెహ్రూ(శ్రీతేజ్) అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ కాలేజ్ లో జరిగే కొన్ని గొడవలను అరికట్టాలని కోరుతారు. వారు చెప్పే కొన్ని సలహాలు రాధాకు నచ్చి యునైటెడ్ ఇండిపెండన్స్ అనే పార్టీను కూడా స్థాపిస్తాడు. ఇది ఇలా ఉండగా రాధాను మట్టుబెట్టాలని ప్రయత్నించే కొందరు సమయం చూసుకొని రాధాను చంపేస్తారు. అప్పటివరకు గొడవలంటే ఏంటో.. తెలియని రాధా తమ్ముడు రంగా(సందీప్ కుమార్) అన్నయ్య చావుతో రగిలిపోతాడు. రంగాను తమ నాయకుడిగా ప్రజలు ఎన్నుకుంటారు. రంగా సపోర్ట్ తో గాంధీ, నెహ్రూలు పార్టీ తరఫున కొన్ని పనులు చేసి జై, జై లు కొట్టించుకుంటారు. అక్కడితో ఆగకుండా వారు మిగిలిన యూనియన్స్ విషయాల్లో కూడా కలగజేసుకుంటున్నారని తెలిసి రంగా పిలిచి మాట్లాడతాడు. దానికి గాంధీ, రంగాతో గొడవ పడతాడు. నెహ్రూ తెలివైన వాడు కావడంతో మరోసారి అతడితో మాట్లాడి చూద్దామని ప్రయత్నిస్తారు రంగా మనుషులు. వారికి గౌరవం దక్కపోవడంతో ఇక గాంధీను చంపాలని నిర్ణయించుకుంటారు. అన్నయ్య చావుతో గాంధీ చిన్న తమ్ముడు మురలి(వంశీ) రగిలిపోతాడు. రంగాను చంపాలని ప్రయత్నిస్తాడు..?మరి అనుకున్నట్లుగా మురలి, రంగాను చంపాడా..? లేక రంగా చేతుల్లోనే మురలి చనిపోయాడా..? చివరకు రంగాను మట్టుబెట్టే వారెవరూ..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ ను తీయాలంటే రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైనా.. రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ వంటి సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టారు. తాజాగా ముప్పై ఏళ్ల క్రితం విజయవాడలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ‘వంగవీటి’ అంటూ వర్మ రూపొందించిన సినిమాపై మొదటి నుండి ఎంతో క్రేజ్ నెలకొంది. అసలు వర్మ రెండు వర్గాల్లో ఎవరిని సపోర్ట్ చేస్తూ.. సినిమా తీస్తాడా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే దీనికి భిన్నంగా వర్మ ఎటువంటి పక్షపాతం చూపించకుండా.. జరిగిన కథను తన స్క్రీన్ ప్లే తో చెప్పాడు. ఈ సినిమాతో వర్మ మరో మెట్టు ఎదిగాడనే చెప్పాలి. ఈ సినిమాలో తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ ను చూడొచ్చు. చాలా రోజుల తరువాత వర్మ మార్క్ సినిమా వచ్చింది. సినిమాలో చాలా వరకు ల్యాగ్ ఉన్నప్పటికీ.. ప్రతి విషయాన్ని డీటైల్డ్ గా చెప్పాలని ఆయన చేసిన ప్రయత్నం కారణంగా ఆ ప్రాసెస్ ను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలుగుతాడు.

ఇప్పటివరకు వర్మ సినిమాల్లో ఇంత వయిలంట్ సినిమా రాలేదనే చెప్పాలి. రక్తచరిత్ర సినిమాలో కూడా వయిలన్స్ ఉంది కానీ ‘వంగవీటి’లో దానికి మించి ఉంది. సినిమాలో మూడు మర్డర్ సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. మనుషుల్ని చంపడాన్ని కూడా ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. సినిమాను చాలా వరకు రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు. వర్మ ఇచ్చే వాయిస్ ఓవర్ సినిమాకు మరో ప్లస్. క్లైమాక్స్ లో ఆయన వాయిస్ ఓవర్ గురించి చెప్పనక్కర్లేదు.. ఏకంగా విజయవాడ దుర్గమ్మను ఈ పనులన్నింటికీ సాక్షి అంటూ ఆయన చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి.

వంగవీటి రాధ, రంగా ఈ రెండు పాత్రల్లో నటించిన సందీప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ మెప్పిస్తాడు. అయితే రాధ పాత్రలో ఆయన కనబరిచిన పవర్ ఫుల్ యాక్టింగ్.. రంగా పాత్రలో కనిపించదు. ఆ పాత్రను ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉంటే బావుండేది. కౌటిల్య, శ్రీతేజ్, వంశీ, నైనా తమ పాత్రల పరుధుల్లో చక్కగా నటించారు. సంగీతం సినిమాకు ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. వంగవీటి కథ అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. అదే కథను వర్మ్గ కూడా సినిమాగా చేశారు. అంతేకాని కథలో ఎలాంటి మార్పులు చేయలేదు.. ఉన్నది ఉన్నట్లుగా తీశారు.

చిన్నపిల్లలు తప్ప మిగిలిన అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాను చూడొచ్చు. రక్తపాతాలు.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇలాంటి కథలతో కూడిన సినిమాలు నచ్చే ప్రేక్షకులు సినిమా ఒకసారి చూడొచ్చు. అయితే వంగవీటి చరిత్ర తెలిసిన వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. ఫిక్షనల్ గా సినిమా చూసే ప్రేక్షకుడికి కథ బాగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 3/5