‘మణికర్ణిక’పై వర్మ ప్రశంసలు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కంగన టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న’మణికర్ణిక’. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీ రాజ్యాన్ని కాపాడతానని మాటిస్తున్నాను’ అంటూ విడుదలైన ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన లభించింది. ప్రత్యేకించి కంగన పులిని వేటాడే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది.

ఈ ట్రైలర్‌ను ఉద్దేశించి వర్మ తాజాగా ట్వీట్‌ చేశారు. కంగన హావభావాలు, ఆమె చూపులోని కసి చివరిసారి ఎంటర్‌ది డ్రాగన్‌లోని బ్రూస్‌లీలో చూశానని అన్నారు. ‘కంగన ముందు పులులు కూడా పిల్లులు అయిపోతాయి. ఆమె కళ్లలోని ధైర్యం చూడకుండా.. చూపుతిప్పుకోలేకపోయా. ఇప్పటి వరకు నేను చూసిన అందరు హీరోల కంటే ఎక్కువ హీరోయిజం ఆమెలో కనిపించింది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

‘మణికర్ణిక’కు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో కంగన సన్నిహితురాలు ఝల్కరీ బాయ్‌ పాత్రలో బుల్లితెర నటి అంకితా లోఖాండే నటిస్తున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.