వరుణ్‌తేజ్‌ ‘వాల్మీకి’ కి అనంతలో కష్టాలు!


మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా వాల్మీకి టైటిల్‌ను మార్చాలని.. వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి పాత్రను నెగిటివ్‌గా చూపిస్తున్నారంటూ బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో వాల్మీకి సినిమాను నిలిపేయాలని కోరుతూ జిల్లా కరెక్టర్‌ను కలిసి బోయ కులస్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా వాల్మీకి సినిమా విడుదలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ పకీరప్ప ఆదేశాలు జారీ చేశారు.

వాల్మీకి సినిమా షూటింగ్ సమయంలోనూ బోయ కులస్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అనంతపురం ముందబండపల్లిలో వాల్మీకి షూటింగ్ సమయంలో బోయకులస్తులు చిత్ర యూనిట్‌పై దాడికి దిగారు. ఆ సందర్భంలో షూటింగ్‌ కూడా నిలిపివేశారు. అయితే వివాదం పూర్తిగా సద్దుమణగకుండానే సినిమా విడుదలకు రెడీ కావడంతో శాంతి భద్రతల దృష్ట్యా అక్కడి అధికారులు సినిమా విడుదలను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో కూడా వాల్మీకి టైటిల్‌పై వివాదాలు చెలరేగుతున్నాయి.